భారీ ర్యా లీ నిర్వహించనున్న ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముగింపు పలుకుతూ శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ ర్యాలీని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. పట్టణంలోని వాల్మీకి సర్కిల్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొననున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 32 వార్డులకు చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కూటమి భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సమీకరణ చేపడుతున్నారు. గత కొన్ని రోజులుగా పట్టణంలోని వివిధ వార్డుల్లో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, సమావేశాలు, ప్రజా సంప్రదింపులతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, పట్టణ ప్రగతి వంటి అంశాలను ప్రజల ముందుంచుతూ ఓటర్ల మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో ప్రచార ముగింపు ర్యాలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. 32 వార్డుల అభ్యర్థులు, పార్టీ నాయకులు ఒకే వేదికపైకి వచ్చి ఐక్యతను చాటడంతో పాటు, ఎన్నికల చివరి ఘట్టంలో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపు మేరకు పట్టణంలోని అన్ని వార్డుల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ర్యాలీలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు సూచిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న తరుణంలో నిర్వహించనున్న ఈ భారీ ర్యాలీ కళ్యాణదుర్గం పట్టణ రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
బోయ రంగస్వామి., సూర్య, కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ .