బోరు వేయాలన్నా అనుమతి తప్పనిసరి : తహశీల్దార్ అబ్దుల్ రెహమాన్
మాగనూర్ సూర్య న్యూస్ :
మండల వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి బోరు బావులు తవ్వకూడదని తహశీల్దార్ అబ్దుల్ రెహమాన్ స్పష్టం చేశారు.
నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశాల మేరకు గురువారం తహశీల్దార్ ఒక ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం 'ఎల్ నినో' ప్రభావం వల్ల వర్షపాతం గణనీయంగా తగ్గిందని, దీనివల్ల భూగర్భ జలాలు అడుగుకి పడిపోయాయని తహశీల్దార్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉన్నందున, మండల ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అత్యవసరంగా తాగునీటి అవసరాల కోసం బోరు వేయాలనుకునే వారు ముందుగా తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం నారాయణపేట జిల్లా భూగర్భ జల అధికారికి ఆర్జీ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
సంబంధిత అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన మరియు అధికారిక అనుమతులు లభించిన తర్వాత మాత్రమే బోరు వేయడానికి వీలుంటుందని తహశీల్దార్ తెలిపారు.
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ పంటల సాగు కోసం కొత్తగా ఎలాంటి బోరు బావుల తవ్వకాలకు అనుమతులు జారీ చేయడం జరగదని తహశీల్దార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా బోర్లు వేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ హెచ్చరించారు. కావున మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు మరియు రైతన్నలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని తహశీల్దార్ విజ్ఞప్తి చేశారు.
ఆంజనేయులు , సూర్య రిపోర్టర్ మాగనూర్ మండలం