స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం
కోవూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకూరుపేట జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కూటమి శ్రేణులందరిపై ఉందని ఆమె స్పష్టం చేశారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇందుకూరుపేట జడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా కూటమి శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. పరస్పర సమన్వయంతో ప్రజల్లోకి వెళ్లి, కూటమి అభ్యర్థికి సంపూర్ణ మద్దతు కూడగట్టాలని ఆమె పిలుపునిచ్చారు. అందరి సహకారంతో పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ని జడ్పీటీసీ సభ్యునిగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమాను వ్యక్తం చేశారు.