15 ఎంపీటీసీ స్థానాలకు 95 నామినేషన్లు
మెలియాపుట్టి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మెలియాపుట్టి మండలంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు వివిధ రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 95 నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.మండలంలోని కోసమాల ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సలాన రోహిణి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సలాన కృష్ణవేణి నామినేషన్ పత్రాలను సమర్పించారు. మర్రిపాడు సి ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బైరసింగి ధరణి నామినేషన్ వేశారు. వీరు మెలియాపుట్టి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహెచ్ నరసింహులుకు నామినేషన్ పత్రాలను అందజేశారు.మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన 95 నామినేషన్లలో తెలుగుదేశం పార్టీ నుంచి 39, వైఎస్సార్సీపీ నుంచి 32, జనసేన పార్టీ నుంచి 13, బీజేపీ నుంచి 5, స్వతంత్ర అభ్యర్థులుగా 5 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల సంఖ్యలో టీడీపీ మొదటి స్థానంలో ఉండగా, వైఎస్సార్సీపీ రెండో స్థానంలో నిలిచింది. జనసేన, బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్లు దాఖలు చేశారు.
మెలియాపుట్టి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సీహెచ్. నరసింహులు ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పి. నరసింహ ప్రసాద్, టి. రాము నామినేషన్ పత్రాలను స్వీకరించి పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పత్రాల పరిశీలన చేపట్టారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రిపోర్టర్ : నాగిరెడ్డి, మెలియాపుట్టి, శ్రీకాకుళం జిల్లా.