ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు: 8 జిల్లాల్లో 14 ఘటనలు నమోదు.. డీజీపీ స్పష్టం
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై డీజీపీ స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, ఓటర్లకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని, రాజకీయాలకు అతీతంగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఇప్పటివరకు 14 హింసాత్మక ఘటనలు నమోదయ్యాయని వెల్లడించిన డీజీపీ, వాటికి సంబంధించి 17 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించామని, అభ్యర్థులను అడ్డుకున్నా లేదా ఓటర్లను బెదిరించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతల ఉల్లంఘన ముప్పు ఉన్నవారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పాటు, పోలీసులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల భద్రతపై అధికారుల పర్యవేక్షణను పెంచాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించిన ఆయన.. ఎన్నికల ప్రచారానికి నిబంధనలు పాటించడం తప్పనిసరి అని గుర్తుచేశారు.