గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సమీక్ష: ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపు
జూబ్లిహిల్స్, మేజర్ న్యూస్: రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ నివాసంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మరియు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల వ్యూహాలు, సిద్ధాంతాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ... గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్‌లో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
అర్హులైన ప్రతి పట్టభద్రుడినీ గుర్తించి, వారి ఓటు హక్కు నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. నాయకులు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌కు అవగాహన కల్పించి ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరియు శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.