వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై పోలీసుల జులుం!
మార్టూరు, మేజర్ న్యూస్:
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం మార్టూరు మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రమావత్ శ్రీనునాయక్‌తో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థితో ఎస్‌ఐ దురుసుగా మాట్లాడటమే కాకుండా, బైండోవర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం.
నామినేషన్ కేంద్రం వద్ద ఎస్‌ఐ దురుసు ప్రవర్తన
నాగరాజుపల్లి ఎంపీటీసీ స్థానం ఎస్టీ రిజర్వు కావడంతో నాగరాజుపల్లి తండాకు చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు రమావత్ శ్రీనునాయక్ శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో అక్కడే ఉన్న స్థానిక ఎస్‌ఐ గతంలో బైండోవర్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, స్టేషన్‌కు రావాలని చెప్పినా ఎందుకు రాలేదంటూ శ్రీనునాయక్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది.
ఈ క్రమంలో దురుసుగా మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాను నామినేషన్ పనిమీద ఉన్నానని ముందే చెప్పానని శ్రీనునాయక్ వివరించినప్పటికీ, ముందుగా నామినేషన్ వేసి త్వరగా బయటకు రావాలని ఎస్‌ఐ ఆదేశించినట్లు సమాచారం.
అభ్యర్థితో పాటు పలువురిని స్టేషన్‌కు తరలింపు
నామినేషన్ ప్రక్రియ పూర్తిచేసుకుని శ్రీనునాయక్ బయటకు వచ్చిన అనంతరం, అతనితో పాటు నాగరాజుపల్లి తండాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు పసుపులేటి శివనారాయణ, తోటా హనుమంతు, కుందేటి హనుమంతు, దాసరి సుబ్బారావు, జసావత్, పర్సానాయక్‌లను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.
బైండోవర్ అనంతరం మళ్లీ స్టేషన్‌కు రావాలంటూ ఆదేశాలు
మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో శ్రీనునాయక్‌తో పాటు మిగిలిన వారిని ఎమ్మార్వో కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి ద్వారా బైండోవర్ ప్రక్రియ పూర్తి చేయించినట్లు సమాచారం. ప్రక్రియ అనంతరం వెళ్లిపోవచ్చని రెవెన్యూ అధికారి సూచించినప్పటికీ, అక్కడే ఉన్న కానిస్టేబుల్ ద్వారా ఎస్‌ఐ వారిని మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావాలని చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ పరిణామంపై అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. బైండోవర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెవెన్యూ అధికారులు వెళ్లిపోవాలని చెప్పినప్పటికీ, తిరిగి స్టేషన్‌కు రావాలని చెప్పడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనికి స్పందించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు చెప్పాల్సింది చెప్పారని, తాము కూడా చెప్పాల్సిన విషయాలు ఉంటాయని సమాధానమిచ్చినట్లు సమాచారం. తాము ఇంకా భోజనం కూడా చేయలేదని శ్రీనునాయక్ తదితరులు చెప్పినప్పటికీ, తప్పనిసరిగా స్టేషన్‌కు రావాల్సిందేనని ఎస్‌ఐ ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల సమయంలో పోలీసుల వ్యవహారశైలిపై చర్చ
నామినేషన్ల చివరి రోజున చోటుచేసుకున్న ఈ పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అభ్యర్థులు తమ నామినేషన్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన సమయంలో, బైండోవర్ అనంతరం మళ్లీ స్టేషన్‌కు రావాలని ఆదేశించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.