బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు
దంతాలపల్లి, మేజర్ న్యూస్, హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి హాజరవుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు బయలుదేరిన బీజేపీ నాయకులను దంతాలపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, జిల్లా పార్టీ ఆదేశాల ప్రకారం దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిరసనకు వెళుతున్న నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతుండగా ముందస్తు అరెస్టులు చేయడం సరైన చర్య కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని కోరారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు గుండగాని భరత్ కుమార్ గౌడ్, మండల యువమోర్చా అధ్యక్షుడు అల్లం చంద్రశేఖర్, జిల్లా యువమోర్చా కార్యవర్గ సభ్యుడు టేకు ఉమేష్ తదితరులు ఉన్నారు.
రిపోర్టర్; రాములు, దంతాలపల్లి, మహబూబాద్ జిల్లా