telangana
భీమ్‌గల్ అర్బన్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
సూర్య,భీమ్‌గల్: భీమ్‌గల్ పట్టణంలోని కృషి హైస్కూల్ ఆవరణలో శుక్రవారం భీమ్‌గల్ అర్బన్ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంతో పాటు వారిలో క్రీడాస్ఫూర్తి, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.ఈ క్రీడా పోటీలను మున్సిపల్ చైర్‌పర్సన్ నాగమణి స్వామి, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐకమత్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ భీమ్‌గల్ మండల అధ్యక్షుడు కాశీరాం, ప్రధాన కార్యదర్శి రవీందర్, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు రవీందర్ రెడ్డి, బసంత్ రెడ్డి, షఫీ, శేఖర్, రాజ్‌కుమార్, నర్సయ్య, జగదీష్, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.అలాగే పీఈటీఏ మాజీ అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి, భీమ్‌గల్ జడ్పీహెచ్ఎస్ పీడీ రమణతో పాటు వివిధ పాఠశాలల పీఈటీలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీల నిర్వహణలో భాగస్వాములయ్యారు. విద్యార్థుల క్రీడా ప్రదర్శనలతో కృషి హైస్కూల్ ప్రాంగణం సందడిగా మారింది.