భద్రతా ప్రమాణాలు లేకుండా రోడ్డుపై భారీ రవాణా..చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి
కొండాపూర్ ; మండలంలోని మల్లేపల్లి శివారులో ఉన్న రీసైక్లింగ్ టైర్ల పరిశ్రమలకు పాత టైర్లను తరలిస్తున్న లారీలు ప్రమాదకరంగా మారుతున్నాయి. భారీగా టైర్లను నింపి, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా రోడ్డుపై ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అధిక లోడుతో వెళ్తున్న లారీ స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో పాఠశాల విద్యార్థులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో తిరిగే వాహనాలను పోలీసులు తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన లారీలను సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.