telangana
వేరుశనగ పంటలను కాపాడండి.. ఎమ్మెల్యేకు రైతుల మొర
- రైతుల సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చిక్కడు వంశీకృష్ణ
- రైతుల సమస్యల పరిష్కరించాలని కే ఎల్ ఐ అధికారులకు ఆదేశం
- ఉప్పునుంతల, సూర్య న్యూస్:
కేఎల్ఐ సాగునీరు అందక సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఉప్పునుంతల మండల రైతులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు మొరపెట్టుకున్నారు. రైతుల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. కేఎల్ఐ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమర్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.శనివారం ఉప్పునుంతల మండల కేంద్రంలోని పోచమ్మ చౌరస్తా వద్ద శ్రీ తేజ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనను కలిసి సాగునీటి సమస్యను వివరించారు. లక్ష్మాపూర్, డిండి వంటి పెద్ద చెరువులకు కేఎల్ఐ నీటిని నింపుతున్న తరుణంలో, సాగులో ఉన్న వేరుశనగ పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే కేఎల్ఐ కాలువల ద్వారా సాగునీరు అందించి పంటలను కాపాడాలని కోరారు.
రైతుల సమస్యను విన్న ఎమ్మెల్యే వెంటనే కేఎల్ఐ ఈఈ అమర్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడి, సాగునీటి సరఫరాపై తగిన చర్యలు తీసుకొని రైతుల సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనతో రైతులు కొంత ఊరట చెందారు.ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కర్నె లక్ష్మీనారాయణ, స్థానిక సర్పంచ్ చింతగళ్ల శ్రీనివాసులు, తిప్పాపూర్ సర్పంచ్ మహేష్ సింగ్, సీనియర్ నాయకులు తిప్పర్తి నరసింహారెడ్డి, యూత్ అధ్యక్షుడు మేడమోని భాస్కర్, శేఖర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.