ఖుల్నా రైల్వే స్టేషన్ వద్ద నల్లటి మసి పూసిన దుండగులు
సూర్య అంతర్జాతీయ డెస్క్: బంగ్లాదేశ్‌లోని ఖుల్నా రైల్వే స్టేషన్ కాంపౌండ్ గోడపై ఏర్పాటు చేసిన నోబెల్ విజేత రవీంద్రనాథ్ టాగూర్ మ్యూరల్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు నల్లటి మసితో వికృతీకరించారు. ఈ వికృత చర్య స్థానిక ప్రజలతో పాటు సాంస్కృతిక వేత్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రధాని తారిక్ రెహమాన్ నగర పర్యటన పురస్కరించుకుని ఖుల్నా సిటీ కార్పొరేషన్ (కేసీసీ) ఆధ్వర్యంలో పట్టణ ప్రాధాన్యతను, చారిత్రక సాంస్కృతిక రంగానికి సేవ చేసిన ప్రముఖులను స్మరించుకుంటూ ఈ గోడ చిత్రాలను రూపొందించారు.
పాత జెస్సోర్ రోడ్డును ఆనుకుని ఉన్న ఈ కాంపౌండ్ గోడపై ఫకీర్ లాలన్ షా, ఎస్.ఎం. సుల్తాన్, కాజీ నజ్రుల్ ఇస్లామ్, ఖలేదా జియా, జియావుర్ రెహమాన్ మరియు మైఖేల్ మధుసూదన్ దత్ వంటి పలువురు ప్రముఖుల చిత్రాలు ఉన్నాయి. అయితే దుండగులు కేవలం రవీంద్రనాథ్ టాగూర్ చిత్రాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని నల్లటి రంగు పూయడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఖుల్నా సదర్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం సమాచారం అందడంతో సమగ్ర విచారణ ప్రారంభించామని తెలిపారు.
టాగూర్ చిత్రానికి మసి పూయడం వెనుక కొన్ని సంకుచిత భావజాల మూకల కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని శిల్పకళా అకాడమీ వెలుపల ఉన్న టాగూర్ గ్రాఫిటీ మ్యూరల్‌ను కూడా ఇట్లే వికృతీకరించారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, లౌకికత్వాన్ని దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్న ఈ విధ్వంసకరులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని, టాగూర్ అందించిన మానవతా విలువలను రక్షించుకోవడానికి ప్రజలందరూ ఏకం కావాలని బంగ్లాదేశ్ సాంస్కృతిక సంఘాలు పిలుపునిచ్చాయి.