ఎండిన పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి
– మూడు క్లస్టర్లలో క్షేత్రస్థాయి పర్యటన – ఈ నెల 10 వరకు పంట నష్టం నమోదు గడువు
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
కరువు పరిస్థితుల నేపథ్యంలో నీరందక ఎండిపోతున్న పంటల నష్టం నమోదు ప్రక్రియను వ్యవసాయ శాఖ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా శనివారం మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ నాయక్ పిరాట్వానిపల్లి, పెనిమెళ్ల, వెల్టూర్ క్లస్టర్లలో ఏఈఓలతో కలిసి పర్యటించారు. ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఎండిపోతున్న పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏఈఓలు చేపడుతున్న పంట నష్టం నమోదు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి పూర్తి వివరాలు సేకరించి, నష్టపోయిన పంటల విస్తీర్ణం, ఇతర వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.మండలంలోని రైతులందరూ తమ పంట నష్టం వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను (ఏఈఓ) సంప్రదించి నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ నాయక్ కోరారు. పంట నష్టం నమోదు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ చివరి గడువు కావడంతో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో వివరాలు అందించాలని సూచించారు.