రూ.12 లక్షలు కేటాయించిన పాఠశాల నిర్మాణంలో కాంట్రాక్టర్ కాలయాపన..
రూ.12 లక్షలు కేటాయించిన పాఠశాల నిర్మాణంలో కాంట్రాక్టర్ కాలయాపన.
* పాత బకాయిల సాకుతో గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.
* ప్రొసీడింగ్స్ ఉన్నా పనులు చేయకుండా విడ్డూరపు వాదనలు.
* వెంటనే పాఠశాల భవనం పూర్తి చేయాలని సర్పంచ్ నవీన్ డిమాండ్.
దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::
దుమ్ముగూడెం మండల పరిధిలోని కే.వీరభద్రపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై 'సూర్య' పత్రికలో వచ్చిన కథనం కదిలించింది.ఒకే గదిలో 40 మంది విద్యార్థులు,ఐదు తరగతుల బోధనతో చిన్నారులు పడుతున్న ఇబ్బందులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.ఎమ్మెల్యే చొరవతో పాఠశాల భవన నిర్మాణానికి రూ. 12 లక్షల ప్రొసీడింగ్స్ మంజూరైనప్పటికీ.. సదరు కాంట్రాక్టర్ మాత్రం తన నిర్లక్ష్య ధోరణితో కాలయాపన చేస్తుండటం పట్ల గ్రామస్తులు,స్థానిక సర్పంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 'మన ఊరు - మన బడి' పథకం కింద కే.వీరభద్రపురం పాఠశాలకు నూతన భవనం మంజూరైంది.అయితే ఎలాంటి అధికారిక ప్రొసీడింగ్స్ పత్రాలు లేకుండానే.. అప్పటి అధికారుల మౌఖిక సూచనల మేరకు లక్ష్మీనగరం గ్రామానికి చెందిన ఒక కాంట్రాక్టర్ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. తదనంతరం ప్రభుత్వాలు మారడం పనులకు సంబంధించిన ఆన్‌లైన్ బిల్లులు రాకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
*ఎమ్మెల్యే చొరవతో కదిలిన ఫైల్.. రూ. 12 లక్షల మంజూరు:*
పాఠశాలలో ఒక్కటే గది ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు, సర్పంచ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి కలెక్టర్‌కు సిఫారసు చేయడంతో.. పంచాయతీ రాజ్ ఏఈ ఆధ్వర్యంలో మిగిలిన పనులకు అంచనా వేయించి ఎంఈఓకు అందించారు.ఈ మేరకు ఆగిపోయిన పనుల పూర్తికి రూ. 12 లక్షలతో అధికారిక ప్రొసీడింగ్ పత్రాలు మంజూరయ్యాయి.
*కాంట్రాక్టర్ కాలయాపన..*
ప్రభుత్వం నుంచి రూ. 12 లక్షల నిధులతో ప్రొసీడింగ్స్ రావడంతో పాఠశాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని స్థానిక సర్పంచ్ నవీన్ సదరు కాంట్రాక్టర్‌ను సంప్రదించారు.అయితే గతంలో తాను చేసిన పనులకు సంబంధించి రూ. 4 లక్షల బిల్లులు రాలేదని ముందు ఆ బకాయిలు ఇస్తేనే పనులు చేస్తానంటూ కాంట్రాక్టర్ మెలిక పెట్టారు.
దీంతో సర్పంచ్ నవీన్ ఆయనను నిలదీశారు. "గతంలో ఎలాంటి అనుమతులు ప్రొసీడింగ్స్ లేకుండా ముందుగానే పనులు చేపట్టింది మీరే కదా ఇప్పుడు ప్రభుత్వ నిధులు రూ. 12 లక్షలు మంజూరై ప్రొసీడింగ్స్ వచ్చాయి కాబట్టి పనులు పూర్తి చేయండి అని కోరారు.దీనిపై కాంట్రాక్టర్ పొంతన లేని సమాధానాలు ఇస్తూ.. గతంలో తాను చేసిన పనులకే ఇప్పుడు ప్రొసీడింగ్ లెటర్ వచ్చిందని, మళ్లీ ఎమ్మెల్యే ఎస్టిమేషన్ వేయించారంటూ గందరగోళం సృష్టిస్తున్నారు. అసలు ఆ ప్రొసీడింగ్ లెటర్ చూపించాలని కోరితే మాత్రం అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నానంటూ కాలయాపన చేస్తూ దాటవేస్తున్నట్లు సర్పంచ్ నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై కాంట్రాక్టర్ను వివరణ కోరగా.. ప్రియాంక అలా కలెక్టర్ ఉన్నపుడు చేసిన పనులకు తనకు ఎప్పుడూ అనుమతి వచ్చింది అని ప్రస్తుతం అనారోగ్యంతో ఇంట్లో ఉన్నానని ఒక రెండు రోజుల్లో వివరంగా చెప్తానని ఆయన సూర్య ప్రతినిధికి తెలిపారు.
*కాసుల కోసం గిరిజన విద్యార్థుల బలిదానమా..*
ఒకపక్క పాఠశాలలో విద్యార్థులు కూర్చోవడానికి స్థలం లేక గందరగోళ వాతావరణంలో చదువు కొనసాగించలేక నానా ఇబ్బందులు పడుతుంటే.. కాంట్రాక్టర్లు మాత్రం తమ స్వార్థం కోసం,బిల్లుల పేరుతో కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ప్రొసీడింగ్స్ వచ్చిన నిధులతో పాఠశాల భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని.గిరిజన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని సర్పంచ్ నవీన్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.