పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కమాన్ చౌరస్తాలో నూతన అర్చ్, జెండా చౌరస్తాలో 150 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య
సూర్య పెద్దపల్లి ప్రతినిధి
పెద్దపల్లి పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రజలు, వ్యాపారులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య కోరారు.శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో పలు అభివృద్ధి పనులపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కమాన్ చౌరస్తా వద్ద ఉన్న ఇరుకైన పాత అర్చ్‌ను తొలగించి, నూతన అర్చ్ నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జెండా చౌరస్తాలో దేశభక్తిని చాటిచెప్పడంతో పాటు పట్టణ సుందరీకరణకు దోహదపడేలా 150 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.మెయిన్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రహదారి మధ్యలో ఉన్న రాళ్లచెట్టును తొలగించే అంశంపై వ్యాపారులు, స్థానిక ప్రముఖులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాల నాయకులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.సమావేశంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించి కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్‌పర్సన్ ముస్కాన్ నాజ్ నయ్యర్ అలీ, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.