కేటీఆర్, కేసీఆర్‌లపై రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్:బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కేసీఆర్‌లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వెయ్యి బస్సులకు మహిళా సంఘాలను యజమానులుగా మార్చామని తెలిపారు. రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టి కోటీశ్వరులను చేస్తేనే తన జన్మ ధన్యమవుతుందని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
సొంత కుటుంబానికే న్యాయం చేయని కేటీఆర్
కేటీఆర్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు గుప్పించిన సీఎం, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే నెపంతో పండుగ రోజున సొంత చెల్లెలిని ఇంటి నుంచి బయటకు తోసేసిన దుర్మార్గుడని ఆరోపించారు. రాఖీ కట్టించుకోవడానికి కూడా సిద్ధపడకుండా దేశం విడిచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వ్యక్తి, ప్రజలకు మంచి చేస్తానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విమర్శలు
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని "కుక్కలు చింపిన విస్తరి" చేశారని రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ మూడేళ్ల కాంగ్రెస్ పాలనకు మధ్య జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలే స్వయంగా బేరీజు వేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ సర్కార్ పేదల క్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని ఉద్ఘాటించారు.