telangana
వెల్టూర్ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
- ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్.. మరో ఆరుగురు పరారీ
- రూ.60,430 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, 104 పేక ముక్కలు స్వాధీనం
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన శనివారం డిండి రిజర్వాయర్ చెక్‌డ్యామ్ సమీపంలో చోటుచేసుకుంది.ఎస్సై పుట్ట మహేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి రిజర్వాయర్ చెక్‌డ్యామ్ సమీపంలో కొందరు వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి అందర్–బాహర్ పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఉప్పునుంతల పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 12 మందిలో ఆరుగురిని పట్టుకోగా, మరో ఆరుగురు అక్కడి నుంచి పరారయ్యారు.
విచారణలో ఈరట్వానిపల్లి గ్రామానికి చెందిన కాట్రావత్ రాజేష్ వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులను పిలిపించి పేకాట నిర్వహిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.60,430 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, 104 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుట్ట మహేష్ గౌడ్ వెల్లడించారు. చలమల గణేష్ గౌడ్ సూర్య రిపోర్టర్
ఉప్పునుంతల