పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు
మెదక్, : పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు వారి జీవితాల్లో సంతోషాలు నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఆదివారం 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమంలో భాగంగా హవేలి ఘన్పూర్ మండలంలోని స్కూల్ తాండ, లింగసాన్ పల్లి తాండ, మెదక్ మండలంలోని శివాయపల్లి, శంకరంపేట్ (ఆర్) మండలంలోని మిర్జాపల్లి తాండ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. సొంతింటిలో పండుగ జరుపుకోవడం ప్రతి పేద కుటుంబానికి ఎంతో సంతోషకరమైన విషయమని, ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజల సంతోషాల్లో భాగస్వామి కావడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని, మెదక్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రాధాన్యత అని డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు.