శ్రీరామనగరంలో భక్తి పారవశ్యం: చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర వేడుకల్లో పాల్గొన్న జూపల్లి రామేశ్వరరావు
శ్రీరామనగరం (ముచ్చింతల్):శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు ("యతీంద్ర సప్తతి") శంషాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర వేడుకల్లో మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారికి మంగళాశాసనాలు అందించారు.
36 ఏళ్లుగా స్వామివారి సేవలో…
ఈ సందర్భంగా మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ... గత 36 ఏళ్లుగా తాము చిన్నజీయర్ స్వామివారి భక్తులుగా, వారి సేవలో భాగస్వాములుగా కొనసాగడం తమ పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో వేద విజ్ఞాన పరిరక్షణకు, అంతరించిపోతున్న సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడటానికి స్వామివారు అందిస్తున్న కృషి అమూల్యమైనదని కొనియాడారు.
బహుముఖ సేవా కార్యక్రమాలు
జీయర్ ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక రంగంతో పాటు విద్య, ఉచిత వైద్యం, మహిళా సంక్షేమం వంటి ఎన్నో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను స్వామివారు విజయవంతంగా నిర్వహిస్తున్నారని జూపల్లి రామేశ్వరరావు ప్రశంసించారు. స్వామివారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'ప్రాజెక్ట్ సహస్ర' బృహత్తర కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇదే వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... చిన్నజీయర్ స్వామివారి నేతృత్వంలో జరిగే ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఎంతో సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు.
Chinna Jeeyar Swamy 70th Thirunakshatra Celebrations
This video shows the grand celebrations of Sri Chinna Jeeyar Swamy's 70th Tirunakshatra Mahotsav at Muchintal.