క్యాన్సర్‌పై అవగాహనే ఆయుధం.. టీకాల పంపిణీకి ప్రత్యేక చర్యలు
సూర్య , మంచిర్యాల జిల్లా ప్రతినిధి : జాతీయ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు క్యాన్సర్ నివారణ, ముందస్తు పరీక్షలపై వైద్యాధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్ ఆదేశాల మేరకు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని, క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని మాతా శిశు సంరక్షణ సంచాలకులు డాక్టర్ కుమారస్వామితో కలిసి పరిశీలించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ధర్నా నేపథ్యంలో జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలకు నిర్ణీత సమయంలో టీకాలు అందేలా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. టీకాల కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని, తల్లిదండ్రులు సహకరించాలని అధికారులు కోరారు.
ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. 14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. 30 సంవత్సరాలు పైబడిన వారు క్రమం తప్పకుండా రొమ్ము, గర్భాశయ ముఖద్వార, నోటి క్యాన్సర్లకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పొగాకు, గుట్కా, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు క్యాన్సర్ ముప్పును పెంచుతాయని హెచ్చరించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా క్యాన్సర్‌తో పాటు మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు. వ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ స్పూర్ణ, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, ధూప్ సింగ్, ఆర్.ఎస్. పద్మ, శ్రీనివాస్, వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, నర్సింగ్ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.