వేరుశనగ సబ్సిడీ అక్రమాలపై విచారణ జరపాలి
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని దర్పల్లి గ్రామంలో వేరుశనగ సాగు పథకం కింద రైతుల పేర్లతో ప్రభుత్వ నిధులు,రాయితీల దుర్వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని పలువురు నాయకులు కోరారు.ఈ మేరకు శనివారం మండల డీటీ సువర్ణకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ వంటనూనెలు-నూనెగింజల ప్రోత్సాహక పథకం కింద వేరుశనగ సాగు చేసే అర్హులైన రైతులకు ప్రభుత్వ సహాయం,రాయితీలు,విత్తనాలు అందించాల్సి ఉందన్నారు.అయితే దర్పల్లి గ్రామంలో వాస్తవంగా వేరుశనగ సాగు చేయని వ్యక్తుల పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చారా?అర్హులైన రైతులకు అందాల్సిన ప్రయోజనాలను ఇతరులకు మళ్లించారా?అనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.మండల వ్యవసాయ అధికారి కృష్ణకిషోర్,నాబార్డు అధ్యక్షుడు,డైరెక్టర్లు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అర్హులైన రైతులకు సమాచారం ఇవ్వకుండా నిధులు,రాయితీలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.ఈ ఆరోపణలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని కోరారు.రైతుల భూముల వివరాలు,సాగు నమోదు పత్రాలు,లబ్ధిదారుల జాబితాలను సరిపోల్చి పరిశీలించాలని,విత్తనాల పంపిణీ,రాయితీలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు.విచారణలో అక్రమాలు రుజువైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాములు,అనంతయ్య,జంగయ్య,శ్రీశైలం,చంద్రశేఖర్ పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.