ఈ20 పెట్రోల్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంది
సూర్య జాతీయ డెస్క్: దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేస్తున్న ఈ20 పెట్రోల్ పూర్తిగా నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాలలో విక్రయిస్తున్న ఇంధనంలో ఇథనాల్ శాతం అధికంగా ఉందంటూ వచ్చిన నివేదికలను కేంద్రం ఖండించింది. కర్ణాటకతో సహా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్ల నుంచి సేకరించిన నమూనాలను కఠినమైన పరీక్షలకు గురిచేయగా, అన్నీ కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నట్లు స్పష్టమైందని అధికారులు వెల్లడించారు.
భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) నిబంధనల ప్రకారం ఇథనాల్ కలిపిన మోటార్ గ్యాసోలిన్ ప్రమాణాలకు లోబడే ఈ20 పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. కర్ణాటకలో సేకరించిన నమూనాలలో ఇథనాల్ శాతం ఎక్కువగా ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు శాస్త్రీయంగా మరియు చట్టపరమైన నిబంధనల ప్రకారం జరగలేదని పేర్కొన్నాయి. ప్రామాణికమైన నమూనా సేకరణ విధానాలు, సరైన ప్రయోగశాల పరీక్షా పద్ధతులను అనుసరించకుండా వెలువడిన ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
దేశంలోని ఇరవై ఏడు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని డిపోలు అలాగే రిటైల్ అవుట్లెట్ల నుంచి సుమారు 893 ఈ20 పెట్రోల్ నమూనాలను సేకరించి నాణ్యతా నియంత్రణ ప్రయోగశాలల్లో పరీక్షించారు. ఈ సమగ్ర పరిశీలనలో అన్ని నమూనాలు కూడా నిర్దేశిత శ్రేణిలోనే ఇథనాల్ కలిగి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ముఖ్యంగా కర్ణాటకలో సేకరించిన నమూనాలు సైతం ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు నిపుణులు తేల్చారు.
పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమంపై అనవసర అపోహలు సృష్టించడం సరికాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారానే ఈ ప్రక్రియ జరుగుతుందని చమురు సంస్థలు వెల్లడించారు. దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.