మనిషి జీవితాన్ని మార్చేది పుస్తక పఠనమే-వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య-హనుమకొండ లో ఘనంగా నవచేతన పుస్తక ప్రదర్శన ప్రారంభం
హనుమకొండ, మేజర్ న్యూస్, పుస్తక పఠనమే మనిషి జీవితాన్ని మారుస్తుందని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. కనీసం రోజుకు ఒక పేజీ అయినా చదవడం అలవాటు చేసుకోవాలని, తద్వారా మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. హనుమకొండ అశోక కాంప్లెక్స్ లో నవచేతన( విశాలాంధ్ర) బుక్ హౌస్ లో నెలరోజుల పాటు నిర్వహించనున్న పుస్తక ప్రదర్శనను ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ జాతీయ పుస్తక వారోత్సవాలు, గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి నిరంతరం పుస్తకాలు చదువుతానని, అనేక సార్లు నవచేతన బుక్ హౌస్ ను సందర్శించి పుస్తకాలు సేకరించానని తెలిపారు. ప్రస్తుత కాలంలో పిల్లలు, పెద్దలు టెక్నాలజీ ద్వారా ఙ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని, కానీ హార్డ్ కాపీ ద్వారా చదవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. పుస్తకాలు మనిషి జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేస్తాయని, ప్రతి ఒక్కరినీ విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ది ఉన్నతంగా నిలబెడుతాయని తెలిపారు.మనిషి నిత్య జీవితంలో పుస్తకాలను చదువుకోవడం వల్ల మన పూర్వీకుల జీవితాలను, వారి అనుభవాలను మన జీవితంలో పాటించే అవకాశం ఉందని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య తెలిపారు.బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్, మహాత్మ గాంధీ, నెహ్రూ రచనలు చదవడం వల్ల దేశ పరిస్థుతులు, రాజకీయాలు తెలుసుకోగలిగానని వివరించారు.దేశంలో అంటారని తనం ఆర్థిక సమస్యలు మత మైనార్టీ ల సమస్యలు ఎలావస్తున్నాయో తెలుసుకొని వాటికి ఎలా రాజ్యాంగం పరిష్కారం చేయాలో పాలన ద్వారా తెలుసుకున్నానని అన్నారు. నవచేతన ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను విద్యార్థులు, పుస్తక ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న ఎంపీ కావ్య నిర్వహకులు ఏర్పాటు చేసిన అనేక పుస్తకాలను పరిశీలించి పలు పుస్తకాలను స్వయంగా కొని తన మిత్రుల చేత కేశవరెడ్డి రాసిన అన్ని పుస్తకాలను కొనాలని కోరడంతో వారు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో నవచేతన గవర్నింగ్ బాడీ సభ్యురాలు నేదునూరి జ్యోతి, బుక్ హౌస్ మేనేజర్ ఎర్ర నాగరాజు, రచయిత ఎలుగటి తిరుపతి రెడ్డి, న్యాయవాది బండి మొగిలి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి,మద్దెల ఎల్లేష్, టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, రాష్ట్ర హౌసింగ్, వెల్ఫేర్ కన్వీనర్ వల్లాల వెంకటరమణ, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడి పెళ్ళి మధు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. వేణుమాధవ్, సిపిఐ జిల్లా నాయకులు నేదునూరి రాజమౌళి, ఎన్. అశోక్ స్టాలిన్, మునిగాల బిక్షపతి, మాజీ కార్పొరేటర్ మాధవి, రచయితలు విద్యా దేవి, కాసర్ల రంగారావు, పాత్రికేయులు మంచాల రాజు, ఎండి ఉస్మాన్ పాషా, తాండూరి గోపి,కుక్కల రాజు, ఉస్నగిరి శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.