వెలుగుల పండుగ.. విద్యార్థుల సంబరాలు!
చౌటుప్పల్, మేజర్ న్యూస్ : పట్టణంలోని గ్రీన్ గ్రోవ్ స్కూల్స్‌లో దీపావళి పండుగను పురస్కరించుకొని ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని పాఠశాల ప్రాంగణాన్ని దీపాలు, రంగురంగుల అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. విద్యార్థుల సృజనాత్మకత, సంప్రదాయ కళాత్మకతతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. వేడుకలను తిలకించిన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయ బృందాన్ని పాఠశాల చైర్మన్ బండి వీణ అనిల్‌కుమార్‌రెడ్డి, డైరెక్టర్ సాదిపల్లి లక్ష్మి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీపావళి దీపాల్లా విద్యార్థుల జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలగాలని, విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.