గ్రామ సమగ్ర అభివృద్ధి లక్ష్యం-సర్పంచ్ కుల్ల మోహన్ రావు-డ్రైనేజీ పై స్లాబ్ నిర్మాణ పనుల ప్రారంభం
జఫర్ ఘడ్, మేజర్ న్యూస్, గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పంచాయతీ పాలకవర్గం అంకితభావంతో పనిచేస్తోందని స్థానిక సర్పంచ్ కుల్ల మోహన్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని 8వ వార్డులో గ్రామపంచాయతీ నిధుల ద్వారా మంజూరైన మురుగు కాలువ (మోరి)పై స్లాబ్ నిర్మాణ పనులను సర్పంచ్ కుల్ల మోహన్ రావు, ఉప సర్పంచ్ కోత్వాల కుమార్, 8వ వార్డు సభ్యురాలు రోడ్డ మమతా రాజులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చాలా కాలంగా డ్రైనేజీపై స్లాబ్ లేకపోవడంతో వార్డు ప్రజలు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దోమల బెడద, దుర్వాసన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత క్రమంలో ఈ పనులను చేపట్టినట్లు వివరించారు. గ్రామంలో నెలకొన్న అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, తాగునీరు వంటి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేసి జఫర్‌గఢ్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వార్డు ప్రజలు పారిశుద్ధ్య నిర్వహణకు సహకరిస్తూ, మురుగు కాలువల్లో చెత్తాచెదారం వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ మెంబర్ జ్యోతి యాకయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కల సారంగం, కాంగ్రెస్ నాయకులు ఉల్లి శివరాజు, వార్డ్ మెంబర్ కుక్కల రాజ్ కుమార్, కార్యదర్శి దినేష్, బిల్ కలెక్టర్ బాలరాజు, గ్రామస్తులు మెరుగు రాజు, సమ్మయ్య, తిప్పర బోయిన కృష్ణ, మెరుగు సంపత్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; సురేష్, జాఫర్ గడ్, జనగామ జిల్లా