telangana
నిరుద్యోగ ఐటీఐ యువతకు సువర్ణావకాశం - మందమర్రిలో నేషనల్ అప్రెంటిసిప్ మేళా
సూర్య, మందమర్రి : ఐటీఐ విద్యను పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మందమర్రి ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 9న నేషనల్ అప్రెంటిసిప్ మేళా (పిఎంఎన్ఎఎం)-2026 నిర్వహించనున్నామని ఐటీఐ ప్రిన్సిపాల్ జి. దేవానంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 9వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగనుందని, ఈ మేళా ద్వారా ప్రముఖ కంపెనీల్లో అప్రెంటిసిప్ శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు పొందేందుకు అభ్యర్థులకు అవకాశం లభించనుందని తెలిపారు. మేళాలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 200 మందిని ఎంపిక చేయనుందని, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, సోలార్ టెక్నీషియన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ట్రేడ్లలో ఐటీఐ అర్హత కలిగిన వారికి నెలకు రూ.17,500 స్టైపెండ్ అందించనున్నారని తెలిపారు. అమరావతిలోని ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్స్ సంస్థలో 300 మందికి అవకాశం ఉండగా, ఎంపికైన వారికి నెలకు రూ.18,500 చెల్లించనున్నారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్ సివిల్, టర్నర్, మిషనిస్ట్, ప్లంబర్, వైర్‌మెన్ ట్రేడ్ల వారు అర్హులని, అదేవిధంగా మంచిర్యాలకు చెందిన ఆదర్శ్ ఆటోమొబైల్స్ సంస్థలో 30 ఖాళీలు ఉండగా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ల అభ్యర్థులకు నెలకు రూ.10 వేల స్టైపెండ్ ఇవ్వనున్నారన్నారు. ఈ మూడు సంస్థల్లో కలిపి మొత్తం 530 అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వీటితోపాటు హైదరాబాద్‌కు చెందిన మరికొన్ని కంపెనీలు కూడా పాల్గొననున్నాయని ప్రిన్సిపాల్ వివరించారు. అభ్యర్థులు తమ బయోడేటా, అప్రెంటిసిప్ రిజిస్ట్రేషన్ కాపీ, ఎస్సెస్సీ మెమో, ఐటీఐ మెమో, ఎన్‌టీసీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో మేళాకు హాజరుకావాలని సూచించారు. అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రముఖ సంస్థల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలను పొందాలని జి. దేవానంద్ పిలుపునిచ్చారు.