గాజువాకలో వ్యక్తి అనుమానాస్పద మృతి
గాజువాక, సూర్య : గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నెలిపూడి గంగాదొర (43) అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకలో కుటుంబంతో కలిసి నివసిస్తున్న గంగాదొర, విశాఖ పోర్టులో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 6న ఆయన మద్యం సేవించి ఇంట్లోని కుటుంబ సభ్యులతో గొడవపడ్డారు. ఈ క్రమంలో డబ్బుల విషయమై తండ్రీకొడుకుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. గొడవ సమయంలో తండ్రిని అడ్డుకునేందుకు కుమారుడు హరీష్ ఆయన మెడను గట్టిగా పట్టుకోవడంతో గంగాదొర ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై మృతుడి అన్న కుమారుడు నెలిపూడి శివ గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాలను పరిశీలించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.