పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ
విజయనగరం, సూర్య : విజయనగరం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించిన జిల్లాలోని వివిధ కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ నవంబరు 7న సందర్శించి, కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించి, భద్రత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి, అధికారులకు భద్రతాపరమైన పలు సూచనలు చేశారు.
జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ విజయనగరం సబ్ డివిజన్ పరిధిలోని లోని విజయనగరం - జె ఎన్ టి యుజొన్నాడ - లెండి ఇంజనీరింగ్ కళాశాల, ఎస్.కోట - వరలక్ష్మి కళాశాల, బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలోని గజపతినగరం - ప్రభుత్వ కళాశాల, బొబ్బిలి - ప్రభాకర్ స్కూల్, చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలోని గరివిడి ఎస్ డి ఎస్ కళాశాల, రాజాం - డి ఏ విస్కూలును సందర్శించి, పోలీసుశాఖ ఏర్పాటు చేసిన భద్రత, బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు విధులకు నియమించిన పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించే విధులు, బాధ్యతలపై ముందుగా స్పష్టమైన అవగాహన కల్పించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేసి, అవసరమైన చోట పోలీసు సిబ్బంది ట్రాఫిక్ రెగ్యులేషన్ చేపట్టారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బాడీ వోర్న్ కెమెరాలు, డ్రోన్లు తదితర నిఘా పరికరాలతో నిఘా పెట్టారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో జరుగుతున్న పరిణామాలను నిరంతరం వీడియో, ఫొటోగ్రఫీ ద్వారా రికార్డు చేయించామన్నారు. అభ్యర్థులు, వారి అధీకృత కౌంటింగ్ ఏజెంట్లను, గుర్తింపు కార్డులను పరిశీలించిన తరువాతనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ చేపట్టే కేంద్రాల వెలుపల గుంపులుగా జనాలు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలకు, శాంతిభద్రతల సమస్యలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి, గ్రామ స్థాయిలో పెట్రోలింగ్, గస్తీ ముమ్మరం చేసి, పికెట్స్ ఏర్పాటు చేశామన్నారు. చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎవరూ ఉద్రిక్తతలకు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని, గెలుపోటములను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించాలని, ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దని ప్రజలను జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ కోరారు.