నారాయణపేట జిల్లాలో 151 విద్యా వాలంటీర్ల నియామకం -- ఈ నెల 13 వరకు దరఖాస్తుల స్వీకరణ.. -- నెలకు రూ.8 వేల గౌరవ వేతనం
నారాయణపేట, నవంబర్ 7(సూర్యన్యూస్): నారాయణపేట జిల్లాలో విద్యా వాలంటీర్ల నియామకానికి జిల్లా విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 151 మంది విద్యా వాలంటీర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజు తెలిపారు. వీరిలో 141 మందిని మండలాల వారీగా పాఠశాలల్లో నియమించనుండగా, మరో 10 మందిని ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ బృందానికి కేటాయించనున్నట్లు వెల్లడించారు.
*మండలాల వారీగా ఖాళీలు..*
జిల్లాలోని 13 మండలాలకు గాను దామరగిద్దలో 14, ఊట్కూర్‌లో 8, గుండుమాల్‌లో 3, మరికల్‌లో 2, మాగనూరులో 22, ధన్వాడలో 12, కొత్తపల్లిలో 7, కృష్ణలో 13, నారాయణపేటలో 28, నర్వలో 3, మక్తల్‌లో 18, మద్దూర్‌లో 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
*అర్హతలు.. ఎంపిక ప్రక్రియ ఇలా..*
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత మండల విద్యాధికారి (ఎంఈఓ) కార్యాలయంలో నిర్దేశిత నమూనాలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. విద్యార్హతలు, వృత్తిపరమైన అర్హతలు, ఇంటర్మీడియట్, డీఈడీ, టెట్ మార్కుల మెమోలు, పుట్టిన తేదీ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు అవసరమైన ఇతర ధ్రువీకరణ పత్రాల స్వీయ ధ్రువీకరించిన ప్రతులను జతచేయాలని తెలిపారు. ఇంటర్మీడియట్‌కు 40, డీఈడీకి 40, టెట్‌కు 20 మార్కుల వెయిటేజీతో మొత్తం 100 మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తామని వివరించారు. రిజర్వేషన్లు, రోస్టర్ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ చేపట్టి, స్థానిక మండలానికి చెందిన అర్హులైన అభ్యర్థులకే ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన విద్యా వాలంటీర్లకు నెలకు రూ.8 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు, నియామక కాలం కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉంటుందని డీఈఓ స్పష్టం చేశారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలికమైనవని, వీటి ద్వారా రెగ్యులర్ ఉద్యోగ హక్కులు లభించవని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు గడువులోగా సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డీఈఓ గోవిందరాజు సూచించారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.