డిసెంబర్ 15 నుంచి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మెకు నోటీసు -- రూ.18 వేల కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్
నారాయణపేట, నవంబర్ 7 (సూర్యన్యూస్) :
ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ రాష్ట్ర యూనియన్ (బీఆర్‌టీయూ–సీఐటీయూ–ఏఐటీయూసీ) సమన్వయ సాధన కమిటీ నిరవధిక సమ్మెకు సిద్ధమైంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే డిసెంబర్ 15, 2026 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 7న సమ్మె నోటీసు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27,130 మంది ఆశా కార్యకర్తలు గత 20 సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించారని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందిస్తున్న పారితోషికం సరిపోవడం లేదని, గత ఐదేళ్లుగా పారితోషికంలో పెరుగుదల లేదని పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18,000 కనీస వేతనం ఫిక్స్‌డ్ వేతనంగా చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం అందిస్తున్న రూ.9,750 పారితోషికాన్ని పెంచడంతో పాటు సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి డిమాండ్లను పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని యూనియన్ స్పష్టం చేసింది. 25 పేజీల డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును కలెక్టర్ కార్యాలయంలో శనివారం అందజేసినట్లు పేర్కొన్నారు. వినతిపత్రం అందించిన వారిలో డి.నాగమ్మ, పి.జయసుధ, సుజాత, వి.అరుణ, అంజమ్మ పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.