జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ
బాపట్ల, మేజర్‌న్యూస్ :
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద జిల్లా పోలీస్ అధికారులు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు కౌంటింగ్ కేంద్రాల వద్ద శనివారం ఉదయం నుంచే పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తున్నారు.
జిల్లాలోని 20 మండలాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, చీరాలలోని చీరాల ఇంజనీరింగ్ కాలేజ్, వేటపాలెంలోని సెంటెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, రేపల్లెలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, ఏబీఆర్ డిగ్రీ కాలేజీల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ఐదు కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 500 మందికి పైగా పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తూ విధులు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు, అగ్గిపెట్టెలు, ఎలక్ట్రానిక్ పరికరాలు తదితర నిషేధిత వస్తువులు ఏమైనా ఉన్నాయా అని తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. కౌంటింగ్ జరిగే ప్రదేశంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో పాటు పోలీసుల బాడీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను రికార్డు చేస్తున్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలలో అదనంగా సుమారు 134 మంది పోలీసులతో పీకెట్స్, పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.