డిసెంబర్ 12న కుటుంబంతో అయోధ్య రామాలయానికి అఖిలేష్
సూర్య పొలిటికల్ డెస్క్: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అయోధ్య పర్యటనకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. 2024 జనవరిలో నూతన రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఆయన ఇప్పటివరకు ఆలయాన్ని దర్శించుకోలేదు. అయితే తాజాగా డిసెంబర్ 12న తన కుటుంబ సభ్యులతో కలిసి అఖిలేష్ యాదవ్ అయోధ్యలోని రామాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పవన్ పాండే అధికారికంగా వెల్లడించారు.
హనుమాన్‌గఢీతో పాటు రామ్‌లల్లా దర్శనం
పవన్ పాండే వెల్లడించిన వివరాల ప్రకారం, డిసెంబర్ 12న అయోధ్యకు చేరుకోనున్న అఖిలేష్ యాదవ్ మొదట ప్రసిద్ధ హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించి ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. అనంతరం రామాలయానికి చేరుకుని బాలరాముడిని దర్శించుకుంటారు. గత నెలలో అయోధ్య సమీపంలో నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన సమయంలోనే రామాలయ సందర్శనకు సంబంధించి తేదీని ఖరారు చేసే బాధ్యతను అఖిలేష్ యాదవ్ స్థానిక నాయకత్వానికి అప్పగించారు. తాజాగా ఈ తేదీని పార్టీ ఖరారు చేయడంతో స్థానిక సమాజ్‌వాదీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఇచ్చిన హామీ అమలు
2024 జనవరి 22న నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది. అయితే నాటి రాజకీయ పరిస్థితులు, విపక్ష 'ఇండియా' కూటమి వైఖరి దృష్ట్యా ఆయన ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. అయినప్పటికీ, ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు పూర్తయిన తర్వాత ఏదో ఒక రోజు తప్పకుండా తన కుటుంబంతో కలిసి అయోధ్యకు వచ్చి రామ్‌లల్లాను దర్శించుకుంటానని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కి రాసిన లేఖలో అఖిలేష్ అప్పట్లోనే స్పష్టం చేశారు. ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు ఆయన ఈ పర్యటన ఖరారు చేసుకున్నారు.
ఎన్నికల ముందు వ్యూహాత్మక అడుగు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమీకరణాల నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ తాజా నిర్ణయం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సమాజ్‌వాదీ పార్టీపై బీజేపీ ఎప్పటికప్పుడు చేస్తున్న హిందూ వ్యతిరేక ముద్రను చెరిపివేసేందుకే ఆయన ఈ పర్యటనకు సిద్ధమయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలిసారిగా అఖిలేష్ రామాలయానికి వెళ్తుండటంపై ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.