ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్...ప్రైవేట్ వీడియోలపై సీరియస్ వార్నింగ్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి సురేఖావాణికి ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలు, కూతురు సుప్రీతతో కలిసి చేసే రీల్స్‌తో సందడి చేసే ఈ నటి ఖాతా తాజాగా సైబర్ కేటుగాళ్ల బారిన పడింది. ఆమె వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ కావడంతో పాటు, కొన్ని ప్రైవేట్ వీడియోలు నెట్టింట వైరల్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై స్పందించిన సురేఖావాణి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు నిజం బయటపెట్టారు.
హ్యాకర్లు తన సోషల్ మీడియా ప్రొఫైల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని, తన అనుమతి లేకుండానే వ్యక్తిగత కంటెంట్‌ను బయటపెట్టారని సురేఖావాణి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలు నిజమైనవా లేక ఏఐ టెక్నాలజీతో సృష్టించిన నకిలీవా అనే చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. వ్యూస్, రీచ్ మరియు పబ్లిసిటీ కోసం ఇలాంటి బాధ్యతారహితమైన పనులకు పాల్పడటం సరికాదని ఆమె హితవు పలికారు. సాటి మహిళ గోప్యతను గౌరవించాలని, ఎవరూ కూడా ఈ ప్రైవేట్ వీడియోలను షేర్ చేయవద్దని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.
సోషల్ మీడియా పేజీలు, కొన్ని మీడియా సంస్థలు, ప్రెస్ సభ్యులు సైతం ఈ వీడియోలను షేర్ చేయడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే ఈ కంటెంట్‌ను ప్రచారం చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన అత్యంత సీరియస్ మేటర్ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భర్తను కోల్పోయి కూతురు సుప్రీతను ఇండస్ట్రీలో నటిగా నిలబెట్టేందుకు కష్టపడుతున్న సురేఖావాణికి ఈ ఘటన తీవ్ర మనస్తాపం కలిగించింది. సైబర్ క్రైమ్ నిపుణుల సాయంతో తన అకౌంట్‌ను సురక్షితంగా రక్షించుకునే ప్రయత్నాలు జరుగుతుండగా, ఆమె చేసిన ఈ తాజా ప్రకటన ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: రేణిగుంట 5వ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ బీడీ బాలాజీ ఘన విజయం!