చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో చిరు వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లు..!
]చర్లపల్లి,:మేజర్ న్యూస్:దీపావళి పండుగను పురస్కరించుకుని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పూలు, పండ్లు, దీపావళి సామగ్రి తదితర వస్తువులను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల నుంచి పారిశ్రామిక మున్సిపల్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పండుగల సమయంలో వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల నుంచి నిర్ణీత రుసుం వసూలు చేయాల్సి ఉండగా, ఎలాంటి సరైన రశీదులు ఇవ్వకుండానే డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పది మంది చిరు వ్యాపారులు వ్యాపారాలు నిర్వహిస్తుంటే కేవలం ముగ్గురు మాత్రమే అధికారికంగా ఫీజులు చెల్లిస్తున్నారని, మిగిలిన వారి నుంచి వసూలు చేస్తున్న మొత్తాలకు సరైన లెక్కలు, రశీదులు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయాన్ని సిబ్బందే చెబుతున్నట్లు వ్యాపారులు పేర్కొనడం గమనార్హం. గత దసరా పండుగ సమయంలోనూ చిరు వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పండుగల సమయంలో నాలుగు రోజులు వ్యాపారం చేసుకుని ఎంతో కొంత ఆదాయం సంపాదించుకుందామనే ఆశతో రోడ్ల పక్కన చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్న పేద వ్యాపారులపై ఈ విధమైన వసూళ్ల భారం మోపడం అన్యాయమని వారు వాపోతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసూలు చేయాల్సిన రుసుంలకు సంబంధించి పారదర్శకత పాటించాల్సిన బాధ్యత మున్సిపల్ సిబ్బందిపై ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రశీదులు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం, వసూళ్లలో వ్యత్యాసాలు ఉండటంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ ఉన్నతాధికారులు ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిరు వ్యాపారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పేద వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకమైన రుసుంల విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధన విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు వివరణ ఇచ్చారు.