సూర్య,కాగజ్‌నగర్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ప్రధాన రహదారులపై భారీ వాహనాల రాకపోకలతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సిర్పూర్ పేపర్ మిల్లు (సర్ సిల్క్)కు సంబంధించిన కట్టెలు, ఇతర సరుకులను తరలించే భారీ లారీలు పట్టణం మీదుగా ప్రయాణిస్తుండటంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. రహదారులపై వాహనాల రద్దీ పెరగడంతో పాటు పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.తాజాగా ఈరోజు శుక్రవారం పట్టణంలో ప్రయాణిస్తున్న ఓ భారీ లారీ రహదారి పక్కన ఉన్న విద్యుత్ తీగలను తాకడంతో అవి తెగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.భారీ వాహనాల రాకపోకల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో భారీ లారీల రాకపోకలను నియంత్రించి, సాధ్యమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలైన బైపాస్ రహదారుల మీదుగా మళ్లించే అంశాన్ని పరిశీలించాలని సూచిస్తున్నారు.అలాగే రహదారుల పక్కన ఉన్న విద్యుత్ తీగలకు భారీ వాహనాల వల్ల ప్రమాదం జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ప్రమాదాలకు తావులేకుండా అధికారులు తగిన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.