telangana
బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి - కొండిల్ల శ్రీనివాస్
సూర్య, మందమర్రి : మంచిర్యాల జిల్లా నుంచి బీసీ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలులో లేని నేపథ్యంలో ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోనైనా వారికి అధిక ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో అర్హత, అనుభవం, ప్రజాసేవలో ముందున్న బీసీ నాయకులను ఎంపిక చేసి పదవులు కేటాయించాలని కొండిల్ల శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.