ఒకే రోజు థియేటర్లలో రెండు సినిమాలు.. చైతన్య జొన్నలగడ్డ డబుల్ సందడి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: యువ నటుడు చైతన్య జొన్నలగడ్డకు సినీ ప్రయాణంలో అరుదైన సందర్భం ఎదురైంది. ఆయన కీలక పాత్రల్లో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకవైపు ఆకాశంలో ఒక తార చిత్రంతో పాటు, మరోవైపు ఓం అపరేషన్ మోల్ సినిమా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశాలు, విభిన్న జోనర్లతో రూపొందిన ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదల కావడంతో చైతన్య పేరు సినీ వర్గాల్లో ఆసక్తిగా వినిపిస్తోంది.
ఆకాశంలో ఒక తార చిత్రంలో చైతన్య జొన్నలగడ్డ ఒక సహాయక పాత్రలో కనిపించి మెప్పించారు. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించగా, కలలు, భావోద్వేగాల నేపథ్యంలో కథ సాగుతుంది. తొలి రోజు నుంచే ఈ చిత్రంపై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది.
మరోవైపు రాజ్‌కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో రూపొందిన ఓం అపరేషన్ మోల్ చిత్రంలోనూ చైతన్య జొన్నలగడ్డ నటించారు. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో చైతన్య పాత్రకు మంచి స్క్రీన్ స్పేస్ లభించిందని, తన పాత్రకు తగ్గట్టుగా నటించారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సరిహద్దు అక్రమ రవాణా, ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భిన్నమైన పాత్రలతో రెండు వేర్వేరు చిత్రాలు ఒకేరోజు థియేటర్లలో విడుదల కావడం ప్రతి నటుడికి ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. రానున్న రోజుల్లో ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న చైతన్య జొన్నలగడ్డకు ఈ డబుల్ రిలీజ్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందని సినీ అభిమానులు భావిస్తున్నారు.
Also Read: హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు