పద్మావతి అమ్మవారికి స్ఫటిక పాత్ర వితరణ -ఐదు లక్షలు వెండి పాత్రను అందజేసిన ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ -అమ్మవారి సేవలో తరించిన దాత కుటుంబం...ఆలయంలో ప్రత్యేక పూజలు
తిరుచానూరు మేజర్ న్యూస్ : తిరుచానూరులో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారి సేవలో మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం ఉదయం టీటీడీ శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ బి. శ్రీధర్ వర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి రూ.5 లక్షల విలువైన 2.5 కిలోల వెండి తిరుమంజన (స్ఫటిక) పాత్రను వితరణగా బహుకరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఏఈవో దేవరాజులుకు వెండి తిరుమంజన పాత్రను అందజేశారు. అమ్మవారి నిత్య తిరుమంజన సేవకు ఈ పాత్రను వినియోగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల విరాళాలతో అమ్మవారి ఆలయం నిత్యం అభివృద్ధి చెందుతోందని, దాతల సహకారం అమూల్యమని వారు పేర్కొన్నారు.అనంతరం శ్రీధర్ వర్మ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ వర్మ సతీమణి, కార్పొరేటర్ జ్యోత్స్న, కుటుంబ సభ్యులు, ఆలయ అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ కాంతం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తిరుచానూరు రిపోర్టర్ మురళి