telangana
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంబించిన ఎమ్మెల్యే, కలెక్టర్
Telangana
20 Nov 2026
27 views
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (IKJBP)ను శుక్రవారం ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని యపల్ గూడ గ్రామంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, కుటుంబానికి అండగా నిలిచే ప్రధాన సంపాదనపరుడు అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఈ పథకం భరోసా కల్పిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నమోదు ప్రక్రియలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డులో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించి అర్హులైన వారందరినీ పథకంలో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.రేషన్ కార్డు ఉన్న కుటుంబాలతో పాటు రేషన్ కార్డు లేని కుటుంబాలు సైతం ఆధార్ ఓటీపీ ద్వారా కొత్తగా నమోదు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. డేటా అందుబాటులో లేదనే కారణంతో ఏ ఒక్క అర్హుడినీ నమోదు శిబిరాల నుంచి వెనక్కి పంపించరాదని అధికారులకు సూచించారు. నమోదు శిబిరాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్ వంటి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు జిరాక్స్, కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ వివరాలతో శిబిరాలకు హాజరుకావాలని సూచించారు. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను నమోదు చేసిన సందర్భంలో క్లెయిమ్ వాటాల మొత్తం 100 శాతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో డప్పు చాటింపు, ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజూ సాయంత్రం శిబిరాల్లో జరిగిన నమోదు వివరాలు, పురోగతిపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, ఎంపీడీవో వంశీకృష్ణ, పంచాయతీ కార్యదర్శి నజిమ, స్థానిక సర్పంచ్ నిరోస, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Latest News