రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో మహారాష్ట్ర ఉత్కంఠ విజయం.. ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో అస్సాంపై గెలుపు
సూర్య స్పోర్ట్స్ డెస్క్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని మహారాష్ట్ర జట్టు ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు సాగిన పోరులో మహారాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనకు దిగిన మహారాష్ట్ర 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
అస్సాం ఇన్నింగ్స్‌లో కెప్టెన్ డెనిష్ దాస్ 33 బంతుల్లో 61 పరుగులతో దూకుడైన ఇన్నింగ్స్ ఆడగా, సిబ్‌శంకర్ రాయ్ 31 పరుగులతో రాణించారు. మహారాష్ట్ర బౌలర్లలో రామకృష్ణ ఘోష్ 4 వికెట్లు పడగొట్టి అస్సాం బ్యాటింగ్‌ను కట్టడి చేయగా, వివేక్ షెలార్ 3 వికెట్లతో ఆకట్టుకున్నారు.
వీరి ధాటికి అస్సాం మిడిల్ ఆర్డర్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్రకు ఆరంభంలోనే సాహిల్ పరాఖ్ (8) రూపంలో షాక్ తగిలింది. ఈ దశలో పృథ్వీ షా 29 పరుగులతో, వికెట్ కీపర్ రుషికేష్ సోనావనే 32 బంతుల్లో 54 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. సోనావనే, షా జోడీ రెండో వికెట్‌కు 81 పరుగులు జోడించి జట్టుకు మంచి పునాది వేసింది.
మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారినప్పటికీ, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. రుతురాజ్ 35 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, సిద్ధేశ్ వీర్ 12 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా తోడుగా నిలిచి ఆఖరి ఓవర్‌లో మహారాష్ట్రను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో టోర్నీలో మహారాష్ట్ర జట్టు తన దూకుడును కొనసాగించింది.