బస్సు ప్రయాణంలో రూ.10 లక్షల చోరీ.. నిందితుడి అరెస్ట్
పటాన్‌చెరు,; బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారి నగదు బ్యాగును చోరీ చేసిన నిందితుడిని రామచంద్రాపురం పోలీసులు, సిసిఎస్ బృందం సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.9.50 లక్షల నగదును స్వాధీనం చేసుకుని కేసును ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామచంద్రాపురానికి చెందిన వ్యాపారి ఎం. వెంకట రమణ అక్టోబర్ 28న కర్ణాటకలోని గుల్బర్గా నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. గుల్బర్గాలోని ఎస్‌బీఐ బ్యాంకు నుంచి డ్రా చేసిన రూ.10 లక్షల నగదును బ్యాగులో పెట్టుకుని ప్రయాణిస్తుండగా, లింగంపల్లి వద్దకు చేరుకునేసరికి బ్యాగు కనిపించకుండా పోయింది. దీంతో బాధితుడు అక్టోబర్ 29న రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోళి తాలూకా రాంశెట్టి నాయక్ తండాకు చెందిన పి. ఉమేష్ చవాన్ (27) ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.9.50 లక్షల నగదుతో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించి భారీ మొత్తంలో నగదును రికవరీ చేసిన రామచంద్రాపురం, సిసిఎస్ పోలీసు బృందాలను ఎసిపి శ్రీనివాస్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు అభినందించారు. బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించే ప్రజలు నగదు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.