అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం - కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి : జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించి పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకూడదని పేర్కొన్నారు. జిల్లాలో ఏఎస్‌డీడీ జాబితా కింద 58,567 మంది ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ఎన్యూమరేషన్ క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం డిసెంబర్ 15వ తేదీ వరకు ఉంటుందని, డిసెంబర్ 22వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని వివరించారు. ఒకవేళ ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 'ఫారం-6' ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.ఓటరు జాబితా సవరణలో భాగంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, ఎన్నికల విభాగం అధికారులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.