అనుమతులు జీ ప్లస్ 2.. నిర్మాణాలు జీ ప్లస్ 3,లేదా జీ ప్లస్ 4.
అనుమతులు జీ ప్లస్ 2.. నిర్మాణాలు జీ ప్లస్ 3,లేదా జీ ప్లస్ 4.
* ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్, తొర్రూర్ డివిజనులో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.
* జీహెచ్‌ఎంసీ ఆదాయానికి గండి.. నిబంధనలు బేఖాతర్!
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్ లో జోరుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి.అను మతులు తీసుకునేది రెండు అంతస్తులకు.. నిర్మించేది మాత్రం మూడు, నాలుగు అంతస్తులు! ఆదిభట్ల సర్కిల్ తుర్కయంజాల్ డివిజన్ పరిధిలోని రాగన్నగూడ బావర్చి ఎదురుగా,తుర్కయంజాల్ విలేజ్ వెళ్లే దారిలో మరియు తొర్రూర్ డివిజన్ పరిధిలోని కమ్మగూడ ఏపీఏటీ కాలనీలో భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీ ప్లస్ 2 అనుమతులు తీసుకొని, నిబంధనలకు విరుద్ధంగా జీ ప్లస్ 3, జీ ప్లస్ 4 అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీ ఆదాయానికి గండి పడటంతో పాటు అధికారుల పర్యవేక్షణపై స్థానికులు ప్రశ్నలు సంధిస్తున్నారు.
అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా!
భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే అనుమతులకు మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. నిర్మాణాలు ప్రారంభ దశలోనే తనిఖీలు చేపట్టి నిబంధనల ఉల్లంఘనలను అడ్డుకోవాల్సిన అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను గుర్తించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్కిల్ డిప్యూటీ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి.
“భవన నిర్మాణదారులు జీహెచ్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలి. అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించినట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. నిర్మాణ అనుమతులు, క్షేత్రస్థాయి పరిస్థితులను తనిఖీ చేసి ఉల్లంఘనలపై చర్యలు చేపడతాం.”
అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడేనా?
తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్లలో అనుమతులకు మించి నిర్మించిన భవనాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు కేవలం నోటీసులకే పరిమితం కాకుండా, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆదాయానికి నష్టం కలగకుండా, భవన నిర్మాణ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్, తుర్కయంజాల్.