అంగరంగ వైభవంగా గురుమా సనాతన సత్సంగ్ : నగరంలోని గోల్డెన్ టెంపుల్ కు ఆధ్యాత్మిక శోభ
హైదరాబాద్ సిటీ బ్యూరో, మేజర్ న్యూస్ (అక్టోబర్ 25): ఆధ్యాత్మిక చింతన, అంతరంగ శాంతి, సనాతన ధర్మ విలువలను ప్రజల్లో విస్తరించాలనే లక్ష్యంతో గురుమా (డా. నేహా) సనాతన సత్సంగ్, ప్రముఖ నేపథ్య గాయని నీరజా పండిట్ భక్తి గీతాల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ, రోడ్ నంబర్ 12లో, కమిషనర్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుమా ఆధ్యాత్మికత, దైవ నామస్మరణ, ధ్యానం, ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాల గురించి వివరించారు. నీరజా పండిట్ ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి.
గురుమా తన సందేశంలో దైవ నామస్మరణకు ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ, భగవంతుడికి అనేక నామాలు ఉన్నప్పటికీ ఆయన నామరూపాలకు అతీతుడని, సమస్త విశ్వంలోనూ దైవత్వం నిండి ఉంటుందని తెలిపారు. సృష్టికి మూలమైన ‘ఓం’ నాదం విశ్వంలోనూ, మన అంతరంగంలోనూ ప్రతిధ్వనిస్తుందని పేర్కొన్నారు. ‘ఓం’ లేదా భగవంతుని ఏ నామాన్ని భక్తితో జపించినా మనసు ప్రశాంతతను పొందుతుందని, ఆత్మ దైవంతో అనుసంధానమయ్యే మార్గంలో ముందుకు సాగుతుందని వివరించారు. దైవ నామంలోని సూక్ష్మమైన ఆధ్యాత్మిక అనుభూతిని గ్రహించేందుకు సద్గురువు మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమని చెప్పారు.
జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుందని గురుమా తెలిపారు. ముఖ్యంగా ప్రకృతిని పరిశీలించడం ద్వారా ఎన్నో గొప్ప విలువలను నేర్చుకోవచ్చని చెప్పారు. నీరు ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తూ అందరికీ ఉపయోగపడటం ద్వారా వినయం, సేవాభావాన్ని బోధిస్తుందని వివరించారు. గాలి, సూర్యుడు, చంద్రుడు ఎలాంటి భేదభావం లేకుండా అందరికీ తమ సేవలను అందిస్తాయని, మనుషులు కూడా సమానత్వం, నిస్వార్థతతో జీవించాలని సూచించారు.
పండ్లు, పూలు, ధాన్యాలు వంటి ప్రకృతి ప్రసాదాలను మనం గౌరవించాలని, ప్రకృతిని తల్లిగా భావించి కృతజ్ఞతతో జీవించాలని గురుమా పేర్కొన్నారు. నామస్మరణ, ధ్యానం ద్వారా మనస్సును ఏకాగ్రం చేసుకుని అంతరంగ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మిక సాధన మన ఇంద్రియాలను, ఆలోచనలను శుద్ధి చేసి జీవితానికి సరైన దిశను చూపుతుందని, సద్గురువు అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానవెలుగు వైపు నడిపిస్తారని వివరించారు.
కార్యక్రమ నిర్వాహకులు ఆచార్య శంకర్‌లాల్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రజలను ఆధ్యాత్మికతకు చేరువ చేయడం, జీవితంలో శాంతి, ప్రేమ, జ్ఞానం, సనాతన ధర్మ విలువలకు ప్రాధాన్యం కల్పించడం ఈ సత్సంగ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గురుమా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, నీరజా పండిట్ భక్తి గీతాలు కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయని పేర్కొన్నారు.
ఈ సనాతన సత్సంగ్ కార్యక్రమాల తదుపరి సమావేశం అక్టోబర్ 27న వరంగల్‌లోని రాజ్పుత్వాడిలో ఉన్న రాధాస్వామి జనరల్ సత్సంగ్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.