అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి
గణపురం, మేజర్ న్యూస్, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన బహుజన వీరుడు పండుగ సాయన్న జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించడం చారిత్రాత్మకమని జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్ అన్నారు.ఈ నెల 22న గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పండుగ సాయన్న జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దొరల ఆధిపత్యాన్ని ఎదిరించి పేదల పక్షాన పోరాడిన పండుగ సాయన్న జీవితం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ఆకుల సుభాష్ ముదిరాజ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై ముదిరాజ్ సమాజంతో పాటు బహుజన వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించేలా కృషి చేసిన మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎంపీ ఈటల రాజేందర్ ముదిరాజ్, నీలం మధు ముదిరాజ్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలోని అన్ని కుల సంఘాల నాయకులు, సంఘాల పెద్దలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, బహుజన నాయకులు, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు ఈ నెల 22న జరిగే కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై పండుగ సాయన్నకు ఘన నివాళులు అర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకుల సుభాష్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.
రిపోర్టర్; ఎల్లయ్య, గణపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా