'పీఠ'ముడి వీడుతున్నట్టేనా! *కొలిక్కివస్తున్న 'సర్దుబాటు' చర్చలు..
విజయనగరం బ్యూరో, సూర్య : విజయనగరం మేయర్ పదవి విషయంలో టీడీపీ, జనసేన మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీట్ల కేటాయింపులో టీడీపీ మిత్రధర్మాన్ని విస్మరించిందని మండిపడుతూ జనసేన వర్గీయులు విడిగా నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో రెండ్రోజులుగా నగరవ్యాప్తంగా నరాలుతెగే ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. మేయర్ స్థానానికి గురాన అయ్యలు సతీమణి రాధిక నామినేషన్ దాఖలు చేయగా, మరో 18మంది కార్పొరేటర్ స్థానాలకు నామపత్రాలు దాఖలు పరిచారు. దీంతో, రెండుపార్టీల మధ్య రెండ్రోజులుగా చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, కొలిక్కి రావడం లేదు. 21న నామినేషన్లు ఉపసంహరణ నాటికి వ్యవహారం సుఖాంతం కాకపోతే ఇక్కడ ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది. జనసేన ఇప్పటికైతే మొదటిరోజు స్టాండ్ కే కట్టుబడి ఉంది. మిత్రధర్మానికి కట్టుబడి గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలకు పట్టుబడుతోంది. అలా జరగని పక్షంలో ఎవరిదారి వారిదే అనే స్ట్రాంగ్ సంకేతాలు పంపిస్తోంది. వారి ప్రతిపాదనలపై బంగ్లాలో విస్తృతంగా చర్చలు నడుస్తున్నాయి. ఎట్టకేలకు కొలిక్కి వస్తున్నాయనే దశలో మళ్లీ మొదటికి వస్తున్నాయి. రెందుపార్టీల్లోనూ అసహనం పెరుగుతోంది. తాడోపేడో తేల్చుకోడానికి ఉభయపక్షాలు రెడీగా ఉంటున్నాయి. దీనివల్ల అంతిమంగా వైసీపీకి లబ్ది చేకూరుతుందనే ఆలోచన ఒక్కటే చర్చలు సాగదీతకు కారణమవుతోంది. అయినా, చర్చల్లో పురోగతి కనిపించడంలేదు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్, ఎంపి కలిశెట్టి కూడా అధిష్ఠానం సూచనలు మేరకు జోక్యం చేసుకుంటున్నా వ్యవహారం తేలడంలేదు. సోమవారం హోంమంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత కూడా ఇక్కడికొచ్చి వివాదంపై చర్చించారు. బేషజాలకు పోకుండా, ఉభయతారకంగా ఉండేలా ఒప్పందానికి తీసుకురావాలని ప్రయత్నించారు. వరుసగా సాగుతున్న చర్చలు కొలిక్కి వస్తున్నట్టుగానే కనిపిస్తున్నా, నామినేషన్ ఉపసంహరణ నాటికి ఎలా మారుతుందో తెలియని అనిశ్చితి కొనసాగుతోంది. రెండుపార్టీల మధ్య రెండ్రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఎపిసోడ్ రోజురోజుకూ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం అశోక్ బంగ్లా సాక్షిగా ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోవడం శ్రేణులు ఊపిరి పీల్చుకునేలా చేసింది. జనసేనలో క్రియాశీలంగా ఉన్న అవనాపు విక్రమ్ అశోక్ బంగ్లాకు వచ్చి సోదరుడు అవనాపు విక్రమ్ తో చేతులు కలిపారు.
అవనాపు విక్రమ్ సతీమణి భార్గవి విజయానికి మనస్ఫూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు. ఉభయులూ ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించి ఈ సంచలన ప్రకటన చేశారు. దీంతో, టీడీపీ కేడర్ ఊపిరి పీల్చుకుంటోంది. అవనాపు విక్రమ్ నిర్ణయం వ్యక్తిగతమా, పార్టీ నిర్ణయమా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టతలేదు. ఏమైనా, కొన్నాళ్లుగా ఎడమోహం పెడమోహంగా ఉన్న అన్నదమ్ములిద్దరూ ఇలా చేతులు కలపడంపై శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇప్పుడు తేలాల్సింది గురాన అయ్యలు వైఖరి. మేయర్ అభ్యర్థిగా భార్య రాధికతో, 18 డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థులుగా అనుచరులతో నామినేషన్ వేయించింది అయ్యలేకనుక, తాజా పరిణామం నేపథ్యంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి, పార్టీ రాష్ట్రపెద్దల సూచనలు లేకుండా విడిగా నామినేషన్లు వేయించే సాహసం చేయరు. ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పెద్దలతో సంప్రదించాల్సి ఉంటుంది. అట్నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడో విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. పార్టీ నేతగా ఉంటూ, పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తూ, ఒకవర్గం కొమ్ముకాస్తూ, అగ్నికి ఆజ్యం తోడయ్యేలా ప్రవర్తిస్తూ, పార్టీపేరుచెప్పుకొని పలు రూపాల్లో లబ్దిపొందుతూ, కొన్ని సందర్భాల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు కూడా వెనుకాడక, ఒక్కోసారి కేడర్ ను డర్టీ ఫెలోస్ అంటూ తూలనాడుతూ, బైటకు మాత్రం పార్టీయే సర్వస్వమంటూ బిల్డప్ డైలాగ్స్ వల్లిస్తూ లోలోపల మాత్రం ఆధిపత్య పోరుకు చేయుతనిస్తూ, పార్టీకి నష్టం చేకూర్చుతున్న ఒక నేత తాజా వివాదానికి కారణమనేది జనసైనికుల్లో చాలామందికి అనుమానాలు లేకపోలేదు.
గతంలో, ఓ ఎన్నారై కు అందలం ఎక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేయడం, కార్యకర్తలను ఉద్దేశించి ఆనేత చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్ అవడాన్ని వారు గుర్తుచేసుకుంటున్నారు.ఐతే, బైటకు వ్యక్తంచేస్తే ఇబ్బందులు తప్పవని భావించి లోలోపల గుటకలు మింగుతున్నట్టు కూడా సమాచారం. చేయాల్సిందంతా చేస్తూ ఏమీ ఎరుగనట్టు వ్యవహరిస్తున్నట్టు మండిపడుతున్నట్టు కూడా టాక్ నడుస్తోంది. ప్రస్తుత వివాదానికి కర్త కర్మ క్రియ ఆ నేతేనని అంటూ, అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు కూడా కేడర్ ఆవేదన చెందుతున్నారు. ఈ సంగతి ఇలాఉంచితే, ఆనేతతో సంబంధం లేకుండా వివాదాన్ని కొలిక్కి వచ్చేలా పట్టువిడుపులు ధోరణి ప్రదర్శించాలని అయ్యలును కోరేందుకు వారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ, సోమవారంనాటికి పరిస్థితులు మెరుగుపడుతున్న సంకేతాలు వెలువడుతున్నందున 21న నామినేషన్లు ఉపసంహరణ గడువునాటికి వివాదం టీకప్పులో తుపాను మాదిరిగా సమసిపోతుందన్న ఆశాభావం కేడర్ నుంచి వ్యక్తమవుతోంది.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.