telangana
ఆసిఫాబాద్‌లో మల్టీ మార్కెట్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థల పరిశీలన
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ఆసిఫాబాద్ పట్టణంలో మల్టీ మార్కెట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన స్థలాన్ని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రతిపాదిత స్థలం యొక్క అనుకూలత, రవాణా సౌకర్యాలు, తాగునీటి వసతి, విద్యుత్ సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించారు. మల్టీ మార్కెట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్థల విస్తీర్ణం, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.మల్టీ మార్కెట్ సెంటర్ ఏర్పాటు ద్వారా స్థానిక వ్యాపారులు, రైతులు, గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తిదారులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. తద్వారా స్థానిక వాణిజ్య కార్యకలాపాలకు ప్రోత్సాహం లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రతిపాదిత స్థలానికి సంబంధించి అవసరమైన సర్వే నివేదికలు, సాంకేతిక అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ప్రాజెక్టు అధికారి సూచించారు. మల్టీ మార్కెట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు ఆదేశించారు.ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో ఈఈటీడబ్ల్యూ తనాజీ, ఏపీఓ (పీవీటీజీ) ఆత్రం భాస్కర్, ఆసిఫాబాద్ తాసిల్దార్ రియాజ్ ఆలీ తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.