ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు క్రీడా జట్ల ఎంపిక
పాలమూరు యూనివర్సిటీ ,మేజర్ న్యూస్ -
పాలమూరు యూనివర్సిటీ క్రీడా విభాగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్ కంట్రీ పోటీలకు పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు హాజరయ్యారు. యూనివర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి విద్యార్థులు ఈ ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు.వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, పాలమూరు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న క్రీడా సదుపాయాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికైన క్రీడాకారులు ప్రతిరోజూ యూనివర్సిటీ క్రీడా మైదానంలో క్రమం తప్పకుండా సాధన చేసి, పోటీలకు సిద్ధం కావాలని తెలిపారు.గతంతో పోలిస్తే పాలమూరు యూనివర్సిటీలో క్రీడల పట్ల ఆసక్తి, పోటీతత్వం పెరుగుతున్నాయని వీసీ పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడల్లో మరింత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో యూనివర్సిటీ ప్రతిష్ఠను చాటాలని పిలుపునిచ్చారు.
ఈ ఎంపికల్లో పురుషుల విభాగంలో 8 మంది, మహిళల విభాగంలో 8 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరు నవంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు కర్ణాటకలోని మంగళూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్ కంట్రీ పోటీల్లో పాలమూరు యూనివర్సిటీ తరఫున పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వై. శ్రీనివాసులు, ప్రొఫెసర్ కె. సత్యభాస్కర్ రెడ్డి, కె. వెంకటరెడ్డి, డాక్టర్ గాలి అన్న, డాక్టర్ సి.హెచ్. అరుణ్ కుమార్, డాక్టర్ రజిని, యుగంధర్, శ్వేత, శారద, మన్యం, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
ఎం.ఓం ప్రకాష్ ,పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్