25న సిద్దిపేటలో మహా పాదయాత్ర మెదక్ ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట;అబద్ధపు పునాదుల మీద అధికారం కోసం కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. సోమవారం సిద్దిపేట బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఇండియా కుటమి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఈనెల 25న సిద్దిపేటలో భారీ మహా పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఎంపీ ప్రకటించారు. మహా పాదయాత్రలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు.కేంద్రమంత్రితో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు,ఎంపీలు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు.కేంద్ర మంత్రి ఢిల్లీ నుండి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వరకు వస్తారన్నారు.మధ్యాహ్నం ఒంటిగంటకు డిగ్రీ కళాశాల మైదానం నుండి విక్టరీ చౌరస్తా మీదుగా పాదయాత్ర కొనసాగుతుందని నాలుగు గంటలకు పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో మంత్రి ప్రసంగిస్తారని తెలిపారు.ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియ చనిపోయిన వారి పేర్లు,నకిలీ ఓటర్లు,ఒకే వ్యక్తి పేరు రెండు చోట్ల ఉండడం లాంటి లోపాలను తొలగించడానికి చేసే ప్రక్రియ అని ఎంపీ వివరించారు.కానీ ఇండియా కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.పార్టీ శ్రేణులు,శ్రేయోభిలాషులు,మేధావులు అందరూ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రెండు గంటలపాటు విక్టరీ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వెళ్లే మార్గం క్లోజ్ అవుతుందన్నారు.రెండు గంటల పాటు వాహనాలు ఇతర మార్గంలో వెళ్లాల్సి ఉంటుందని సహకరించాలని కోరారు.సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్,విబిషన్ రెడ్డి బాసంగారి వెంకట్,కాసనిగొట్టు సంతోష్,కొత్తపల్లి వేణుగోపాల్,గోనె మార్కండేయులు,తాటికొండ శ్రీనివాస్,బొడ్డు సునీల్,సాయి,సందీప్ తదితరులు పాల్గొన్నారు.