విపత్తులపై అప్రమత్తతే వజ్రాయుధం.. అవగాహనే ప్రాణరక్షణ
ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో విపత్తుల నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహణ
ర్యాలీ, ప్రత్యక్ష ప్రదర్శనలు, పోటీలతో విద్యార్థినుల్లో చైతన్యం
ఖమ్మం రురల్ సూర్య మేజర్ న్యూస్ : విపత్తులు సంభవించిన తర్వాత స్పందించడం కంటే.. ముందస్తు జాగ్రత్తలతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే లక్ష్యంగా ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల అటానమస్‌లో అంతర్జాతీయ విపత్తుల ప్రమాదాల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేరా యువ భారత్–ఖమ్మం, ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు విపత్తుల నివారణ, అత్యవసర రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా వివరించారు. అనంతరం ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు.
విపత్తుల నివారణపై అవగాహనతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమని కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు పిలుపునిచ్చారు. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక బాధ్యతను అలవరచుకుని ప్రజల్లో చైతన్యం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బత్తుల గోపాల్, అకడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకట రమణ, ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రతినిధి టి. వెంకటేష్, మేరా యువ భారత్ అకౌంట్స్ అధికారి కె. భాను చందర్ తదితరులు పాల్గొన్నారు.